విజయవాడ : ‘నవరత్నాల’ మీద దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల్ని పక్కనపెట్టిందా ? వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందని అంటున్న తెలుగుదేశం పార్టీ నేతల మాటల్లో వాస్తవం ఎంత? ఈ కొద్ది మాసాల్లోనే బ్రహ్మాండం బద్దలయిపోతున్నట్టు ఎందుకు వారంతగా గగ్గోలు పెడుతున్నారు.? ప్రతిపక్షం కాబట్టి వారు రాజకీయంగా మాట్లాడుతున్నారని అనుకుంటే.. మరి ప్రజాభిప్రాయం ఏమిటి?
ఈ ప్రశ్నలకు అంత ఇథమిత్థంగా ఆన్సరైతే దొరకదు. రాష్ట్రం ప్రస్తుతం రాజకీయంగా రెండు గ్రూపులుగా విడిపోయి వుంది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు.. కొద్ది రోజుల తరువాత వుండే రాజకీయ వేడి ఇంకా చల్లారనే లేదు. ఇటువంటి వాతావరణంలో అభిప్రాయాలు కొంత సానుకూలంగానూ, ప్రతికూలంగానూ వుంటాయి. కాకపోతే, ప్రభుత్వంపై వివిధ వర్గాలలో అసంతృప్తి ఉందన్న ప్రచారం మాత్రం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. చెప్పుకునేంత గొప్పగా ఈ ప్రభుత్వం లేదని వినవస్తున్న వ్యాఖ్యలకు సర్కార్ వ్యవహార శైలి కూడా ఊతమిస్తోందని చెప్పాలి. దేనికీ స్ఫష్టమైన సమాధానం ఉండటం లేదు. ఇదీ ఈ ప్రభుత్వ విధానం అని చెప్పేవారు కూడా లేకపోయారు. ఎన్నికలకు ముందుచెప్పిన మాటలకు, ఇప్పటి చేతలకు పొంతన లేదనేది వివిధ వర్గాలనుంచి వినవస్తున్న వాదన. అభివృద్ధి పూర్తిగా స్థంభించిపోయిందని, సంక్షేమం మినహా మరే విషయంలో ప్రభుత్వం చొరవ చూపించడం లేదని చెబుతున్నారు. అసలు కూల్చివేతలతోనే ఈ ప్రభుత్వ పాలన ఆరంభమైందనే విమర్శలు ఉన్నాయి. కరకట్ట పక్కన కృష్ణానది ఒడ్డున నిర్మించిన ప్రజావేదికను పడగొట్టిన నాటి నుంచి పోలవరం, అమరావతి ఇష్యూస్ వరకు అనేక అంశాల్లో చాలా తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వానికి రాకూడని అపఖ్యాతి వచ్చిందని అంటున్నారు. తొలి జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ‘ఈ హాల్లో ఇంతమంది కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూర్చునివున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా, అవినీతితో కట్టిన భవనం ఇది. ఈ హాలు నుంచే ఆదేశాలు ఇస్తున్నా. మొదటి అక్రమ నిర్మాణం కూల్చివేత ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి’ అని తెగేసి చెప్పారు. 25వ తేదీ ఎస్పీలతో సమావేశం ముగిసిన తరువాత దానిని కూల్చివేశారు. ఆ తరువాత రాజధాని అమరావతి పనులను ఆపివేశారు. అక్కడి నిర్మాణాలన్నీ ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. పనులు చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు, ఇతర ఉద్యోగులు తమ తమ ప్రాంతాలకు తరలిపోయారు. ఇక్కడ చిల్లర వ్యాపారాలు సగానికి సగం తగ్గిపోయాయి. మరోవైపు ‘రివర్స్ టెండరింగ్’ పేరుతో పోలవరం బహళార్థసాధక ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయే పరిస్థితి. నవయుగ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కోర్టుకెళ్లడం.. రివర్స్ టెండర్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగిపోయాయి. కేంద్రం కూడా రివర్స్ టెండరింగ్‌పై ముందుకు పోవద్దని అంటోంది. ఇక, ఇసుక రవాణాపై ఆంక్షలు విధించడంతో రాష్ట్రంలో ఇతర నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయి. యజమానులు ఎలా ఉన్నా, పనులు ఆగిపోవడంతో కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత కొందరిని తొలగించి రోడ్డున పడేశారు. చిన్నచితకా కూలి పనులు చేసుకునేవారికి ఆసరాగా ఉన్న అన్న క్యాంటిన్లను మూసివేశారు. నోటి కాడ కూడు లాగేస్తున్నారని నిరుపేదలు తిట్టుకోవడం మీడియాలో చూశాం. నిరుద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ భృతి నిలిపివేశారు. ఈ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
రాజధాని విషయంలో గానీ, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గానీ చంద్రబాబు నాయుడు ముందు కాలయాపన చేసి ఎన్నికల సమయం దగ్గరకొచ్చేసరికి అధికారులను, కాంట్రాక్టర్లను తొందరపెట్టారని, పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా అలాగే చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాఫీగా జరిగే పనులను నిలిపివేయడం వల్ల ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అయితే.. ఇక, ఈ ప్రభుత్వాన్ని సమర్థించేవారు మొదటి రెండు నెలల్లోనే జగన్ సర్కార్ అనేక ప్రయోజనకరమైన చట్టాలు చేశారని మెచ్చుకుంటున్నారు. రాజకీయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని, అవినీతి నిర్మూలనకు అనేక చర్యలు చేపట్టారని వారు గుర్తుచేేస్తున్నారు. సామాజిక న్యాయం సమకూర్చడానికి సంచలన నిర్ణయాలతో జగన్ ముందుకు సాగుతున్నారన్న అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతోంది. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక స్థితిని సరిదిద్ది త్వరలోనే జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటపట్టిస్తారన్న ఆశాభావంతో వారున్నారు. వారి ఆకాంక్షలు నెరవేరాలని ఆశించడం మినహా ఇప్పుడు ఎవరైనా చేసేదేం లేదు.