చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు సూచించారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. బాధితులు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తిరుపతి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు.. భాకరాపేట ఘాట్‌లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మృతి చెందగా.. మరో 40 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.