ఏపీ రహదారులకు మహర్దశ వచ్చింది. శుక్రవారం ఏపీలోని ఏకంగా 31 కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీలో జాతీయ రహదారులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రూ. 10,400 కోట్లతో రహదారుల పనులకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు సీఎం జగన్. జాతీయ రహదారుల పరిధి 4,190 కిలోమీటర్ల నుంచి 8 వేల కిలోమీటర్లకు పైగా పెరిగిందన్నారు.
ఏపీలో 51 ప్రాజెక్టులకు ఇవాల్టితో ముందడుగు పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదో మైలురాయి లాంటి రోజన్నారు. రూ. 20 వేల కోట్ల విలువైన 51 ప్రాజెక్ట్ లను నెలకొల్పనున్నామన్నారు. గడ్కరీ గారి సహకారంతో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ వేగంగా పూర్తయిందని వెల్లడించారు సీఎం జగన్.
2019 ఆగస్టులో విజయవాడ బెంజ్ సర్కిల్ లో పశ్చిమ వైపు రెండో ఫ్లైఓవర్ కావాలని తాను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని.. తన విజ్ఞప్తి పట్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెంటనే అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన సహకారంతో రెండున్నరేళ్లలో ఫ్లైఓవర్ పూర్తయిందన్నారు.రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మేలు పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
విశాఖ పోర్టు నుంచి భీమిలి, భోగాపురం వరకు ఆరు లైన్ ల రహదారి చాలా అవసరమన్నారు. విజయవాడకు బైపాస్ రోడ్డు అవసరమని.. ఇప్పటికే పశ్చిమ బైపాస్ కు అనుమతించారని అన్నారు. తూర్పు బైపాస్ కు కూడా అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.