వైఎస్ వివేకానంద హత్య కేసు జగన్ సర్కార్ ను వెంటాడుతోంది. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే వైఎస్ వివేకా హత్య జరిగిందని ఆరోపించారు.
బాబాయిని చంపడానికి ఎంపీ టిక్కెట్ కారణమని పేర్కొన్నారు. ఈ కేసులో విజయసాయిరెడ్డిని కూడా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తన తప్పులు బయటపడుతుంటే సీఎం జగన్ డైరెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కోడి కత్తి కేసు నాలుగేళ్లు అయినా ఎందుకు విచారణ సాగుతోందని ప్రశ్నించారు. ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అసలు ఏపికి సీఎం జగన్ రెడ్డా.. సజ్జల రామకృష్ణా రెడ్డా.. అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
వివేకానంద రెడ్డి హత్యను జగన్ రెడ్డి ఆనాడు చంద్రబాబుకు ఆపాదించారని, అవినీతి పత్రికలో విషం కక్కారని అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక హత్య కేసు మాఫీ చేయాలని చూశారని… ఇప్పుడు సీబీఐ విచారణలో వాస్తవాలు బయటికి వస్తున్నాయన్నారు. రక్తపు మడుగులో ఉంటే విజయసాయి రెడ్డి గుండె పోటు అని ఎలా చెప్పారని ప్రశ్నించారు.
వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆమెను చూస్తే ప్రజలు కూడా న్యాయం జరగాలని కోరుతున్నారని అయ్యన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కేసును ఎలా తారుమారు చేద్దామా అని చూస్తున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో గందరగోళంగా ప్రకటనలు చేస్తున్నారని, విశాఖను రాజధానిగా ఏ చట్టం ప్రకారం పెడతారని ప్రశ్నించారు.