ఈ ఏడాది జులైతో గోపీచంద్ -జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘లక్ష్యం’ రిలీజై 15 ఏళ్లు అవుతుంది. 2007 లో విడుదలై సూపర్ హిట్టయిన ఈ సినిమాకు శ్రీవాస్ డైరెక్టర్. ఆ సినిమా తర్వాత గోపీచంద్ -శ్రీవాస్ కలిసి ‘లౌక్యం’ సినిమా చేశారు. మళ్ళీ ఇప్పుడు శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్ మూడో సినిమా చేస్తున్నాడు.
వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న ఆ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా ఈమధ్య రిలీజ్ చేశారు. హైదరాబాద్, కోల్ కతాకు మధ్య నడిచే కథగా చిన్న హింట్ కూడా ఇచ్చారు. తాజాగా 2 రోజులు షూట్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి మరో కొత్త డి షెడ్యుల్ మొదలవుతుంది. మైసూర్, కోల్ కతా, హైదరాబాద్ సిటీస్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్ర చేయనున్నట్లు తెలిపారు. గోపీచంద్ -జగపతి బాబు -శ్రీవాస్ కాంబినేషన్ లో ‘లక్ష్యం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ళకి పదిహేనేళ్ళ తర్వాత ఈ కాంబోలో సినిమా రానుంది. అయితే సినిమాలో జగ్గుబాయి రోల్ ఏంటనేది ఇంకా చెప్పలేదు మేకర్స్.
నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా రాజశేఖర్ ను అనుకున్నారు. రాజశేఖర్ కు నెరేషన్ కూడా ఇచ్చారు. ఆ వెంటనే కొన్ని రోజులకు రాజశేఖర్ అంగీకరించారు కూడా. కానీ అలా రోజులు గడిచేకొద్దీ, తన పాత్రకు రాజశేఖర్ కొన్ని మార్పులు చెప్పడం, మేకర్స్ దాన్ని తిరస్కరించడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి రాజశేఖర్ తప్పుకున్నాడు. ఇప్పుడీ రోల్ లోకి జగపతిబాబు వచ్చి చేరాడు. తాజా సమాచారం ప్రకారం ఇదొక విలన్ రోల్ అని తెలుస్తోంది.