రాజ్యాంగం మార్చాలన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ఊరూరా టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు, దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే మంత్రి జగదీష్ రెడ్డి కేసీఆర్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ చేసిన కామెంట్స్ అగ్గికి ఆజ్యం పోసినట్లుగా అనిపిస్తోంది.
రాజ్యాంగం ఇష్యూలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ నేతలను తిడుతూనే.. భారత రాజ్యాంగం జడ పదార్థమేం కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగం ఉండాలని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చుతామనడంలో తప్పేముందని అన్నారు.
ఇప్పటికే అనేకసార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నారన్న విషయాన్ని గుర్తు చేసిన జగదీష్ రెడ్డి.. ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ఒకప్పుడు రోడ్లు చిన్నగా ఉండేవని.. కాలం మారేకొద్దీ వాటిని పెద్దవి చేశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి రాజ్యాంగంలో మొదటి పీఠిక ఏముందో తెలుసా అంటూ ఎద్దేవ చేశారు.
కేసీఆర్ ని అర్థం చేసుకునే జ్ఞానం కాంగ్రెస్, బీజేపీ నేతలకు లేదన్నారు మంత్రి. బూతులు తిడితే నాయకులు కాలేరని విమర్శలు చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని చెప్పారు. కేసీఆర్ తీసుకున్న ముందు చూపు నిర్ణయాలే దానికి కారణమని తెలిపారు జగదీష్ రెడ్డి.