సీఎం కేసీఆర్‌తో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. సీఎం ఛాంబర్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మాట్లాడేందుకే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.
తమ నియోజకవర్గ అభివృద్ది పనుల విషయంలో అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలు ప్రధానిని కూడా కలుస్తూ ఉంటారని ఆయన అన్నారు. అలాంటప్పుడు ఎమ్మెల్యేగా తాను సీఎం కేసీఆర్ ను కలవడంలో ఎలాంటి తప్పూ లేదని ఆయన సమర్థించుకున్నారు.
తాను చేసిన ప్రతిపాదనల పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. తనను మరోసారి కలవాలని కేసీఆర్ సూచించారని ఆయన వెల్లడించారు. సమావేశంలో మహబూబ్ సాగర్ అభివృద్ధి, దళిత బంధు పథకాలపై కేసీఆర్ తో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది
సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తే ప్రగతి భవన్ కు వెళ్లి ఆయన్ని కలుస్తానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాలాకాలంగా బహిరంగంగానే చెబుతున్నారు. చాలా నెలల తర్వాత ఆయనకు కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడం, ఇరువురు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.