కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అవమానాలు తట్టుకోలేనంటూ రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన్ను సీనియర్లు ఎట్టకేలకు బుజ్జగించారు. ప్రస్తుతానికి రాజీనామాపై వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు జగ్గారెడ్డి.
ఆటోలో అసెంబ్లీకి వచ్చిన జగ్గారెడ్డి.. తర్వాత మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అపాయింట్ మెంట్ ఇప్పిస్తే వాళ్ళకే తన ఆవేదనను చెప్పుకుంటానన్నారు. ఠాకూర్, వేణుగోపాల్ దగ్గర పరిష్కారం దొరకదని భావిస్తున్నట్లు చెప్పారు.
రాజీనామా అంశాన్ని 15 రోజుల పాటు పక్కన పెడుతున్నట్లు తెలిపారు జగ్గారెడ్డి. ప్రస్తుతానికి కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. అప్పటిలోగా అపాయింట్ మెంట్ ఇప్పించకపోతే ఆ తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. సీనియర్ల మీద గౌరవంతోనే ఈ 15 రోజుల గడువు తీసుకున్నానని చెప్పారు.
పార్టీ అధిష్టానంపై తనకు కోపం లేదన్న జగ్గారెడ్డి.. రాజీనామా చేస్తే దరిద్రం పోతుందని వేణుగోపాల్ ఎలా అంటారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సన్నిహితులే ఇలా మాట్లాడితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యవహారంపై రేవంత్ టీ కప్పులో తుపాను అని అనడంలో తప్పు లేదన్నారు. కానీ.. ఈ పంచాయితీకి మూలం వెతకడం లేదని తెలిపారు. అసలు.. జగ్గారెడ్డి ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చిందో ఠాకూర్ సమాధానం చెప్పాలన్నారు. అపాయింట్‌మెంట్ ఇప్పించకపోతే రాజీనామాపై తన స్టాండ్ మారదని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.