రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు జగ్గారెడ్డి. కాకపోతే తనను నిర్లక్ష్యం చేయడమే నచ్చడం లేదని వివరణ ఇచ్చారు. పార్టీలోని బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని నేతలందరినీ కలుపుకుపోయే తత్వం రేవంత్ కు లేదన్నారు. ఆయన ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని మండిపడ్డారు.
సోషల్ మీడియాలో తనను కించపరిచేలా కొందరు కావాలనే పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. తనకు కాంగ్రెస్, సోనియా, రాహుల్ కుటుంబంతో ఇబ్బంది లేదని రేవంత్ తోనే పంచాయితీ అని స్పష్టం చేశారు. ఇటీవల రేవంత్ మెదక్ పర్యటన సందర్భంగా ఫోన్ చేసి వెళ్తున్నా అని సమాచారం మాత్రమే ఇచ్చారని.. రమ్మని పిలవలేదన్నారు. అదే సమయంలో దామోదర రాజనర్సింహకి ఫోన్ చేసి రమ్మన్నారని వివరించారు. అందుకే మనస్థాపానికి గురయ్యానని తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా? అని ప్రశ్నించారు.
తాను పీసీసీ కావాలని కోరుకున్నానని మనసులో మాట బయటపెట్టారు జగ్గారెడ్డి. కొందరు సీనియర్లు తనతో మాట్లాడేందుకు భయపడుతున్నారని చెప్పారు. ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని.. కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారు. రేవంత్ కు రాజకీయంగా ఝలక్ ఎలా ఇవ్వాలో తనకు బాగా తెలుసన్నారు. పార్టీలో కలిసి సాగుదామని రేవంత్ ఏనాడు తనకు చెప్పకపోగా.. అనుచరులతో తనపై టీఆర్‌ఎస్ ముద్ర వేయిస్తున్నారని వాపోయారు. ముత్యాల ముగ్గులో హీరోయిన్ మాదిరిగా తన పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.
Advertisements
ఇటీవల సీఎల్పీ ఆఫీస్ లో కలిసినప్పుడు తాము కలిసిపోయామని అనుకునేలా ఫొటోలు బయటికి వచ్చాయన్నారు జగ్గారెడ్డి. రేవంత్ తనను బుజ్జగించారని అందరూ అనుకున్నారని.. కానీ.. కలిసి పనిచేద్దామని కూడా ఆయన తనతో ఏనాడు అనలేదని తెలిపారు.