– యూపీఏ కూటమిని కేసీఆర్ చీలుస్తున్నారా?
– బీజేపీ ముద్ర పోగొట్టుకునేందుకు చూస్తున్నారా?
– ఎన్డీఏ కూటమి నేతలను ఎందుకు కలవడం లేదు?
– ముంబై టూర్ నేపథ్యంలో తెరపైకి కొత్త ప్రశ్నలు
ఆర్నెల్లకోసారి కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించే కేసీఆర్ ముంబై పర్యటన తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వన్ బై వన్.. ప్రతిపక్ష నేతలతో కేసీఆర్ భేటీ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తుండగా.. రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు తమదైన స్టయిల్ లో స్పందిస్తున్నారు. కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టే రీతిలో సెటైర్లు వేస్తున్నారు.
కేసీఆర్, థాక్రే భేటీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. మహారాష్ట్ర సీఎంను కేసీఆర్ కలవడం రాజకీయ కోణమేనన్నారు. యూపీఏ కూటమిని చీల్చాలని సీఎం అనుకున్నా అయ్యే పనికాదని.. బీజేపీతో నేరుగా కొట్లాడుతోంది కేవలం స్టాలిన్, మమతలేనని అభిప్రాయపడ్డారు. డీఎంకే, టీఎంసీ, శివసేన కాంగ్రెస్ వైపు ఉన్న పార్టీలేనని గుర్తు చేశారు. తనపై పడిన బీజేపీ ముద్ర పోవడానికే బీజేపీని వ్యతిరేకించే నేతలను కేసీఆర్ కలుస్తున్నారని ఆరోపించారు జగ్గారెడ్డి.
నిజానికి జగ్గారెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదని అంటున్నారు రాజకీయ పండితులు. ఏడున్నరేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు వంతపాడుతూ వచ్చి.. అప్పుడప్పుడు యుద్ధమని ప్రకటనలు చేసిన కేసీఆర్ ను నమ్మడానికి లేదని చెబుతున్నారు. ఇన్నేళ్లలో కేంద్రం తెచ్చిన బిల్లులకు మద్దతిస్తూ.. యూపీఏ కూటమిలోని పార్టీలనే కలుస్తుండడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కేసీఆర్ పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.
మరోవైపు కేసీఆర్ ముంబై పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా స్పందించారు. ప్రజా ఆగ్రహం తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబై టూర్ అంటూ హడావుడి చేస్తున్నారని అన్నారు. జాతీయ పార్టీ లేకుండా.. ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ప్రయత్నించి విఫలమయ్యారని ఎద్దేవ చేశారు. ప్రజలెవరూ కేసీఆర్ అబద్ధపు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేరని ఆరోపించారు. ఎన్డీఏ, యూపీఏ మినహా మరే ఇతర కూటమి దేశంలో రాణించలేదని అభిప్రాయపడ్డారు రాజేందర్.
కాంగ్రెస్ నేతలేమో.. యూపీఏను బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని అంటున్నారు. బీజేపీతో కలసి కేసీఆర్ కుమ్మక్కయ్యారని చెబుతున్నారు. అటు కమలనాథులను చూస్తే.. కేసీఆర్ వల్ల ఏం కాదని తేల్చేస్తున్నారు. ఈ డైలాగ్ వార్ నడుమ.. సీఎం ముంబై టూర్ హాట్ టాపిక్ గా మారింది.