టీఆర్ఎస్, బీజేపీ దాగుడు మూతలు ఆడుతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆ రెండు పార్టీలు కలిసి తమ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్, మోడీ లెవల్ లో చీకటి ఒప్పందం ఉందని.. వందల కోట్లతో మునుగోడు ఉప ఎన్నికకు సిద్ధం అయ్యాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ ఖర్చు చేస్తోంది తమ డబ్బే అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
స్టేట్ ఎన్నికల కమిషన్ ని కేసీఆర్, సెంట్రల్ ఎన్నికల కమిషన్ ని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు జగ్గారెడ్డి. తాము ఏ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఇచ్చే డబ్బులను జనం తీసుకుని కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు. డబ్బులు పంచితే ఓట్లు వేయరనే సంకేతం ఇవ్వాలన్నారు. ఎన్నికల ప్రచారానికి ఎవరు రాకున్నా కాంగ్రెస్ కి నష్టం లేదన్న ఎమ్మెల్యే.. చండూరులో పార్టీ ఆఫీస్ తగులబెట్టడం వెనుక టీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయని.. పోలీసులు కేసీఆర్ చెప్పినట్టు వింటున్నారని మండిపడ్డారు.
దాడులు చేసే సంస్కృతి తమకు లేదని.. ఒకవేల ఏదన్నా ఇష్యూ జరిగినా రిమాండ్ చేస్తారని వ్యాఖ్యానించారు. కొందరు పోలీసులు వెనకాల ఉండి దాడులు చేయిస్తున్నారని.. వారి మద్దతు లేకుండా ఇదంతా జరిగే పని కాదన్నారు. డీజీపీ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.
మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపించాలని ప్రజలను కోరారు జగ్గారెడ్డి. పాల్వాయిది నెహ్రుతో కలిసి పని చేసిన చరిత్ర అని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలు స్రంతిని గెలిపించుకోవాలని కోరారు.