ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూల నిర్ణయాలు ఉండాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తెలంగాణలో కూడా రైతు ఉద్యమం మొదలవ్వాలని చెప్పారు. ఢిల్లీలో రైతు ఉద్యమానికి కేంద్రమే వెనక్కి తగ్గిందన్న ఆయన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వస్తుందని అంచనా వేశారు. సూసైడ్ నోట్ రాసి రైతులు చనిపోతున్నారని.. ఇది ఎంతో కలిచి వేసే విషయమని చెప్పారు.
రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు జగ్గారెడ్డి. గాంధీ భవన్ తలుపులు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయన్న ఆయన.. ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే భార్య పిల్లలు అనాధలు అవుతారన్నారు. రైతుల ఆందోళన.. ఆత్మహత్యలు చూసి బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు సిగ్గుపడాలని విమర్శించారు. రెండు పార్టీలు రాజకీయంగా ఎలా బతకాలో అనే పంచాయితీ కానీ.. రైతును బతకనిద్దామని అనుకోవడం లేదని మండిపడ్డారు.
టీఆర్ఎస్‌లో మంత్రులు డమ్మీ కాగా.. బీజేపీలో బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డమ్మీలని విమర్శించారు జగ్గారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందిస్తూ… మంత్రి హరీష్ సొంత జిల్లాలో ఏకగ్రీవం కాకుండా చేయడమే తమ మొదటి విజయమన్నారు. రెండున్నరేళ్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. కానీ తాము అభ్యర్థిని పెట్టడంతో అందరికీ హరీష్ టచ్ లోకి వెళ్లారని… ఇది తమ రెండో విజయంగా చెప్పారు. ఇక ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే హరీషే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రబుల్స్ పడ్డారని.. ఇది తమ మూడో విజయమన్నారు. కాంగ్రెస్ కు దాదాపు నాలుగు వందల ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు జగ్గారెడ్డి.