తెలంగాణలో బీజేపీది థర్డ్ ప్లేస్ అని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. టీఆర్‌ఎస్‌తో దోస్తానా ఉండదన్న ఆయన.. కొట్లాటేనని చెప్పారు. ఎవరితో కలిసి పని చేయాలి అనేది ఢిల్లీలో నిర్ణయిస్తారని.. స్థానికంగా ఏమీ ఉండని తెలిపారు. రాహుల్ గాంధీపై ప్రశాంత్ కిషోర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్న జగ్గారెడ్డి.. గాంధీ భవన్‌కి వస్తే ఇక్కడ ఎంతమంది ప్రశాంత్ కిషోర్‌లు ఉన్నారో తెలుస్తుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 230 ఓట్లున్న కాంగ్రెస్‌ను చూసి టీఆర్‌ఎస్ భయపడుతోందన్నారు జగ్గారెడ్డి. అందుకే ఫిర్యాదులు చేస్తోందని విమర్శించారు. 300 మందిని నార్త్ ఇండియా టూర్‌కు పంపింది ఎవరని ప్రశ్నించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బెదిరించిన ఆడియో సంగతేంటని నిలదీశారు. అప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేసిందన్నారు.
“ఎన్నికల కమిషన్ అధికార పార్టీదే కదా? మంత్రులు, ఎమ్మెల్యేలు యాత్రలకు పంపుతున్న ఫోటోలు బయట పెడుతున్నా. ఇవి తప్పు కాదా? ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది” అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి.