అత్తకొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు ఏడ్చిందట వెనుకటికి ఒకావిడ. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని వెనకేసుకొస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం ఇప్పుడు అలానే ఉంది. దుబ్బాకలో కాంగ్రెస్ ఓటమిని తట్టుకోలేని కార్యకర్తలు అందుకు కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వ లోపమేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంటే.. అలా అనుకోవద్దని వారిని ఓదార్చాల్సింది పోయి.. రివర్స్‌లో వారిపైనే జగ్గారెడ్డి తెగ ఫైర్ అయ్యారు తాజాగా ఓ మీడియా చిట్‌చాట్‌లో. ఉత్తమ్ నాయకత్వం నచ్చని వాళ్లే వ్యతిరేక పోస్టులు పెడుతున్నారంటూనే .. వారు అసలు కాంగ్రెస్ కార్యకర్తలే కాదంటూ అంతెత్తున లేచారు.
నిజమాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఫెయిల్ అయ్యారని సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు పెట్టలేదని వారిని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పోస్టులు పెట్టాలో అర్థం లేకుండా మాట్లాడారు. ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లక్ష్మణ్ కూడా గతంలో ఓడిపోయారని…కాబట్టి వారు అసమర్థులా అంటూ పక్క పార్టీ గురించి మాట్లాడుతూ వచ్చారు.
ఇక దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి నైతిక బాధ్యత వహించి హరీష్ రావు రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ చేసిన జగ్గారెడ్డి.. అదే కాంగ్రెస్ ఓటమికి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ ఆయన్ను వెనకేసుకొచ్చారు. పైగా దుబ్బాకలో అభ్యర్థిని చివరి నిమిషంలో ప్రకటించడం వల్లే కాంగ్రెస్ నష్టం జరిగిందంటూ.. ఆ అభ్యర్థిని ప్రకటించే బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే అధికంగా ఉందన్న విషయాన్ని కూడా మరిచిపోయి మాట్లాడారు.
కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరగాలని సీనియర్‌లు మీడియా ముందు మాట్లాడటాన్ని కూడా జగ్గారెడ్డి జీర్ణించుకోలేకపోయారు. వారు అలా అభిప్రాయపడటం తప్పని తెగ బాధపడిపోయారు. ఉత్తమ్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు పోస్టులు పెడితే ఎలాగూ నచ్చలేదు.. కనీసం పార్టీ నేతలు కూడా అదే అభిప్రాయం చెప్తోంటే వినకుండా ఉత్తమ్‌నే ఉత్తముడు అంటే ఎలా జగ్గారెడ్డి అంటూ ఆ పార్టీ నేతలు గుస్సా అవుతున్నారు.