ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్లు ఆయన వ్యాఖ్యలపై బహిరంగంగానే మండిపడుతున్నారు. మరో వైపు బీఆర్ఎస్ తో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని.. అసలు కాంగ్రెస్ తో పొత్తుకు బీఆర్ఎస్ కూడా ఆలోచన చేయదని ఖండించే పనిలో పడ్డారు. సీనియర్ నాయకుడైన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇలా మాట్లాడడం ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కోమటి రెడ్డి పై ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ ఫైట్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. పార్టీలో పొత్తుల చర్చ లేదని, ఏ నిర్ణయమైనా రాహుల్ గాంధీదే ఫైనల్ అని చెప్పారు. పార్టీలో సొంత నిర్ణయాలకు తావు లేదని తేల్చి చెప్పారు. సింగిల్ మెజారిటీతో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని చెప్పలేదని పేర్కొన్నారు.
ఎన్నిలక తరువాత మిశ్రమ ప్రభుత్వం వస్తుందని కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎందుకు అన్నారో తనకు తెలియదన్నారు జగ్గారెడ్డి. ఇక బీజేపీకి తమపై ఆరోపణలు చేసే అర్హత లేదన్న ఆయన.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే కలిసి పని చేశాయని ఆరోపణలు చేశారు. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ డైరెక్ట్ మద్దతు తీసుకుందన్నారు.
ఆ రెండు పార్టీలు అవగాహనలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందళన చెందాల్సిన అవసరం లేదని, రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్ అని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత ఫుల్ మెజారిటీ రాకుంటే.. ఆ పరిస్థితులు వేరన్నారు. అయితే అప్పటి పరిస్థితులపై ఇప్పుడు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలుసు.. అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.