– తొలివెలుగుపై ఊగిపోయిన జగ్గారెడ్డి
– జర్నలిస్టులు మూర్ఖులు, చిల్లర మనుషులు అంటావా?
– సహనం కోల్పోయి దిగజారుడు మాటలు ఏంది?
– కేటీఆర్ నీకు కండువా కప్పారని ప్రసారం చేసింది ఎవరు?
– జర్నలిస్టులకు వార్తలు ఎలా రాయాలో..
– మీ అనుకూల ఛానల్స్ రిపోర్టర్లకు చెప్పుకో
– తొలివెలుగు ప్రజల గొంతుక..
– నువ్వు చెబితే జర్నలిజం నేర్చుకునే స్థాయిలో లేము
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ పెరిగిందనేది కాదనలేని సత్యం. కానీ, టీపీసీసీలో కొందరి వ్యవహారశైలి మాత్రం పార్టీ శ్రేణులనే కాదు.. నాయకులను సైతం దిగ్భ్రాంతికి గురయ్యేలా చేస్తోందని గాంధీ భవన్ లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యవహారం ఒకటని చెప్పుకుంటున్నారు.
కేసీఆర్ తో పాటు ప్రభుత్వ నిర్ణయాలపై రేవంత్ రెడ్డి పోరుబాట కొనసాగిస్తున్నారు. అయితే.. ఆయన ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టకుండా ప్రభుత్వం కట్టడి చేసే పరిస్థితి. ఎర్రవెల్లి రచ్చబండ కావొచ్చు.. హెడ్ మాస్టర్ జితురాం నాయక్ కుటుంబానికి వెళ్లే విషయం కావొచ్చు.. ఇలా అన్ని విషయాల్లో రేవంత్ ని పోలీసులతో కేసీఆర్ కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ జరుగుతోంది. కానీ, అసలు చర్చ అంతా జగ్గారెడ్డి చుట్టే నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఫెయిల్ అయ్యేందుకు కేసీఆర్ అండ్ కో శ్రమిస్తోంది. అందులో భాగంగానే జగ్గారెడ్డిని కోవర్ట్ గా చేసున్నారన్న ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా నడుస్తోంది. సరిగ్గా రేవంత్ కార్యక్రమం రోజే జగ్గారెడ్డి తెరమీదకు వచ్చి కేసీఆర్ సన్నిహిత ఛానల్స్ కి మాత్రమే లీకులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అనుమానాలు మొదలయ్యాయి. దీన్ని బేస్ చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోందని తొలివెలుగు ఓ కథనం ప్రసారం చేసింది. అది కరెక్ట్ కాదని.. జగ్గారెడ్డి ఖండించవచ్చు. కానీ ప్రెస్ మీట్ పెట్టి పూనకం వచ్చిన వ్యక్తిలా తొలివెలుగుపై ఉగిపోయారు. అంతటితో ఆగకుండా జర్నలిజం విలువల గురించి మాట్లాడారు. అయినా.. నువ్వా జర్నలిస్టులకు నీతులు చెప్పేది. చెప్పాల్సినవన్నీ నీ భజన ఛానల్స్ రిపోర్టర్లకు చెప్పుకో. నీ బాష నీ సంస్కారం ఇదేనా? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ఇంకోసారి తొలివెలుగు జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది నిఖార్సయిన జర్నలిస్టులు. గుర్తు పెట్టుకో.