కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్స్ పై రైతులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఆఖరికి సంక్రాంతి సందర్భంగా కూడా ముగ్గులు వేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సోమవారం మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల-నిజామాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు రైతులు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇండస్ట్రియల్ జోన్ నుంచి తమ భూములను కాపాడాలని నినాదాలు చేశారు అన్నదాతలు. ఈ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు వచ్చి రైతులతో మాట్లాడారు. అయితే.. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. తమ భూములు గుంజుకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్యలకు సైతం సిద్ధమని రైతులు బాధతో చెబుతున్నారు.
మరోవైపు మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే రాజీనామాకు సైతం సిద్ధమని అధికార పార్టీ సర్పంచులు హెచ్చరిస్తున్నారు. గ్రామపంచాయతీల తీర్మానాలతోనే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ చేసిన వ్యాఖ్యలపై అంబారిపేట గ్రామ సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి తీర్మానాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
తీర్మానాలు ఇవ్వకుండానే ఇచ్చామని ఏ విధంగా చెప్పారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులతోపాటు సర్పంచులు కూడా నినదిస్తున్నారు. ఇటు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పైనా రైతులు పోరుబాట కొనసాగిస్తున్నారు.