ఢిల్లీలోని జహంగీర్ పురి అల్లర్ల కేసులో 14 మంది నిందితులను రోహిణీ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. వీరిలో ప్రధాన నిందితుడు అన్సార్ ను పోలీసులు కోర్టుకు తీసుకు వెళుతుండగా పుష్ప సినిమా స్టైల్ లో మెడకింద చేయిపెట్టుకుని తగ్గేదేలే అని కెమెరాలకు ఫోజులు ఇచ్చాడు.
ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిందితుడు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల్లో అన్సార్ ఒకరు. మరో నిందితుడు అస్లాంతో పాటు అన్సార్ ను ఒక రోజు పోలీసు కస్టడీకి కోర్టు పంపింది.
జహంగీర్ పురిలో మత ఊరేగింపు సమయంలో ఇరు వర్గాల మధ్య శనివారం ఘర్షణ జరిగింది. ఈ అల్లర్లలో మొత్తం తొమ్మిది మంది పౌరులకు, ఎనిమిది మంది పోలీసులకు తీవ్రమైన గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో మొత్తం 21 మందిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు బాలనేరస్తులు ఉండటం గమనార్హం. నిందితుల నుంచి కత్తులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.