గుంటూరు: ప్రత్యేక హోదా, విభజన హామీలను పట్టించుకోని ప్రభుత్వం అధికారానికి దూరంకాక తప్పదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. విభజన తరువాత కాంగ్రెస్ అధికారం కోల్పోగా, నాలుగేళ్ల కాలాన్ని వృధా చేసిన చంద్రబాబు అధికారం పోగొట్టుకున్నదని గుర్తుచేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మేలుకొని కేంద్రం పై అఖిలపక్షం ఏర్పాటు చేసి పోరాడాలని జై ఆంద్రప్రదేశ్ ఉద్యమ జేఏసి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.
‘ఆంధ్రా ఎంపీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ, వారు హోదా సాధన కోసం ఇంకా పోరాటం మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. ఇది సమంజసం కాదు’ అని సుబ్రహ్మణ్యం అన్నారు. ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు, అవదానుల హరి, దొంతా సురేష్, ఆర్వీ సుబ్బు, సికిందర్, వెల్లల సాయి, నరసింహారావు, మూర్తి, వహీద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని విభజన హామీలన్నీ అమలయ్యే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. నవతరం పార్టీ కార్యదర్శి వి గణేష్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రత్యేక హోదాపై జగన్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే దానిపైనే ఆ పార్టీ అధికారంలో కొనసాగాలా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని వక్తలు అభిప్రాయపడ్డారు.