కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై పోరాటాన్ని కాంగ్రెస్ ఉదృతం చేస్తోంది. ఇప్పటికే నిరసన కార్యక్రమాలను పార్టీ చేపడుతోంది. తాజాగా పలు కార్యక్రమాలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు 30 రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘జై భారత్ సత్యాగ్రహం’కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వెల్లడించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని మరోసారి ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంలో జేపీసీ వేయాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా లోక్ సభ స్పీకర్ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ‘లోక్ తంత్ర బచావో మశాల్ శాంతి మార్చ్’ను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎర్రకోట నుంచి టౌన్ హాల్ వరకు సాగే ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఈ పోరాటాన్ని చేపడుతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.