కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోవడం ప్రతిపక్ష ఫ్రంట్‌కు సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కూటమి ఏర్పడితే, అందులో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
కర్ణాటకలో జరగబోయే ఎన్నికలు, ఈ ఏడాది జరగనున్న రాష్ట్రాల ఎన్నికలే కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాబట్టి వీటన్నింటి గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందర పాటు అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం తాము పలు రాష్ట్రాల ఎన్నికలతో పూర్తిగా బిజీగా ఉంటామన్నారు. 2024 ఎన్నికల గురించి తరువాత చూద్దామన్నారు.
మోడీ సర్కార్ తీరుపై ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీ- హిండెన్ బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేందుకు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. స్నేహితున్ని కాపాడుకునేందుకు మోడీ సర్కార్ చాలా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ప్రస్తుతం దేశంలో నడుస్తున్నది అమృత కాలం కాదని, ఆపద కాలమని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, సహకరించాల్సిన బాధ్యత విపక్షాలదని ఆయన పేర్కొన్నారు. కానీ బీజేపీ సర్కార్ ఉభయసభల్లో విపక్షాలను నోరు తెరువనివ్వడం లేదని ఆయన ఆరోపించారు.