జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కు చెందిన నలుగురు దోషులకు రాజస్థాన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. కేసులో ఒకరిని నిర్దోషిగా విడుదల చేసింది. ఉరిశిక్షపడ్డ వారిలో మహ్మద్ సైఫ్, సర్వర్ ఆజ్మి, సల్మాన్, సైపుర్ రెహమాన్ లున్నారు. షహబాజ్ హుస్సేన్ ను నిర్దోషిగా విడుదలయ్యారు. సంఘటన జరిగిన 10 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష ఖరారైంది.
2008 లో రాజస్థాన్ రాజధాని జైపూర్ లో శక్తివంతమైన వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 80 మంది చనిపోయారు. 170 మంది గాయపడ్డారు. దోషులంతా ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు. ఈ పేలుళ్ల కుట్ర అంతా ఉత్తరప్రదేశ్ లో ని ఆజంఘడ్ కు చెందిన మహ్మద్ అతిన్ పన్నాడు. అతిన్ చెప్పినట్టుగా నలుగురు పేలుడు పదార్ధాలను సైకిళ్లకు కట్టి నగరంలోని జనసమ్మర్థం గల తొమ్మిది పార్కింగ్ ప్రాంతాల్లో ఉంచి రిమోట్ కంట్రోల్ తో పేల్చారు. రాత్రి 7.20-7.45 గంటల మధ్య బాంబులన్నీ ఒకేసారి వరుసగా పేలాయి. పేలుళ్ల కుట్రదారుడు అతిన్ ఢిల్లీ బాట్లా హౌస్ దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.