జమ్మూ కశ్మీర్ కి సంబంధించి 370 అధికరణంపై నాడు జవహర్లాల్ నెహ్రూ పాటించిన వైఖరి మీద హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాంరమేష్ కౌంటరిచ్చారు. షాను ఆయన తన ‘సాహెబ్’ (ప్రధాని మోడీ) లాగే అబద్దాలను ప్రచారం చేయడంలో దిట్ట అని ఆరోపించారు. నెహ్రూ కావాలనే నియంతృత్వంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ని చేర్చలేదని నాడు దీనిపై పెద్ద చర్చ జరిగిందని ఆయన తెలిపారు.
నోట్ల రద్దును మోడీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు చర్చ ఏమైనా జరిగిందా అని ప్రశ్నించారు. 370 అధికరణంపై నాడు సర్దార్ పటేల్, అంబేద్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీ వంటివారు అభ్యంతరం చెప్పలేదన్నారు, ఆ నాడు సర్ నరసింహన్ అయ్యంగార్, గోపాలస్వామి అయ్యంగార్ ఈ అధికరణాన్ని రూపొందించారని. అప్పుడు ఎవరూ రాజీనామా చేయలేదని జైరాంరమేష్ పేర్కొన్నారు.
తమిళనాడుకు చెందిన అయ్యంగార్ 1937-43 మధ్య జమ్మూ కశ్మీర్ సంస్థాన పీఎంగా పని చేశారని, భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చెందిన ఏడుగురు సభ్యుల్లో ఆయన ఒకరని గుర్తు చేశారు. 1947 ఆగస్టు 29 న ఈ కమిటీ ఏర్పాటైందన్నారు. ఆ తరువాత అయ్యంగార్ 370 ఆర్టికల్ ని రూపొందించారని, ఇది జమ్మూ కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించినదని అన్నారు.
జమ్మూ కశ్మీర్ సమస్యలనెదుర్కోవడానికి నెహ్రూయే కారణమని, కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించిందని అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. గుజరాత్ లో బీజేపీ నిర్వహించిన ‘గౌరవ్ యాత్ర’ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 370 అధికరణాన్ని నెహ్రూ చేర్చిన ఫలితంగానే ఈ కేంద్రపాలిత ప్రాంతం సమస్యలను ఎదుర్కొందని చెప్పారు. ప్రతివారూ దీన్ని తొలగించాలని కోరారని, మోడీ ఒక్క కలంపోటుతో ఈ చర్య తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.