కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. లోగడ. జమ్మూ కశ్మీర్ లో తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా తనను కలుసుకున్న పలువురు మహిళలు తమపై అత్యాచారాలు జరిగాయని, లైంగిక వేధింపులకు గురైన తమను కాపాడాలని తన వద్ద వాపోయారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరాలను సేకరించడానికి పోలీసులు ఆయన నివాసానికి చేరుకోవడమే గాక ఆయనకు నోటీసునివ్వడానికి యత్నించారు.
పైగా బాధిత యువతి ఒకరు వచ్చి తనపై అత్యాచారంతో సహా దాడులు జరిగాయని తనకు చెప్పి విలపించిందని ఆయన అప్పట్లో చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశావా అని తాను ప్రశ్నించగా.లేదని చెప్పి . సిగ్గుతో మాట్లాడలేకపోయిందన్నారు. నాటి ఆ కామెంట్లపై ఢిల్లీ పోలీసులు ఇన్నాళ్లకు స్పందించి ఇలా నోటీసులివ్వడానికి రావడాన్ని పార్టీ నేత జైరాం రమేష్ తీవ్రంగా ఖండించారు.
భారత్ జోడో యాత్ర ముగిసి 45 రోజులకు పైగా గడిచిపోయిందని, వారికి అంతగా ‘ఆందోళన’గా ఉంటే గత ఫిబ్రవరిలోనే తమ నేతను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు. చట్ట ప్రకారం పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ న్యాయనిపుణుల బృందం దీనిపై స్పందిస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై సమాచారాన్ని సేకరించి బాధిత మహిళల వివరాలను తెలుసుకునేందుకు, ఆయనకు నోటీసునివ్వడానికి తాము ఆదివారం ఉదయం ఆయన నివాసానికి వచ్చినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వారి వివరాలు సేకరించి వారికి న్యాయం జరిగేలా చూడడమే తమ ఉద్దేశమని స్పెషల్ సీపీ హుడా వెల్లడించారు.