చైనా నుంచి భారత్ కు పొంచి ఉన్న ముప్పు గురించి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు తెలియదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో చైనా ఏం చేస్తున్నదన్న దానిపై అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని ప్రధాని మోడీ చేసిన ప్రకటన చైనాకు ఓ ఆహ్వానంవంటిదేనని, ఆ దేశం మళ్ళీ చొరబడే అవకాశం ఉందని చెప్పారు.
లండన్ లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో ఇంటరాక్ట్ అయిన రాహుల్.. భారత విదేశాంగ విధానాన్ని తాను సమర్థిస్తానని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానంపట్ల తనకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. కానీ చైనా పట్ల ప్రదర్శిస్తున్న ఉదాసీనతే అభ్యంతరకరంగా ఉందన్నారు. ఇప్పటికే చైనా భారత భూభాగంలోకి చొరబడిందని, ఇండియాకు చెందిన రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిందని అయన అన్నారు.
కానీ మోడీ మాత్రం సరిహద్దుల్లో ఎవరూ ప్రవేశించలేదని, ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేదని చెబుతున్నారని, ఇది భారత చర్చల ప్రక్రియను దెబ్బ తీస్తోందని రాహుల్ చెప్పారు. ‘చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది.. రెచ్చగొట్టే తీరులో వ్యవహరిస్తోంది. అందువల్లే అప్రమత్తత ఎంతైనా అవసరం.. ఇదే విషయాన్ని నేను మాటిమాటికీ చెబుతున్నాను’ అని రాహుల్ పేర్కొన్నారు.
చైనాపై తమ పార్టీ పాలసీని గురించి వివరిస్తూ ఆయన.. భారత భూభాగంలోకి ఎవరినీ అనుమతించరాదన్నదేనన్నారు. అది ఎవరైనా సరే .. సరిహద్దుల రక్షణ అత్యంత ప్రధానమని తమ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ఆయన తెలిపారు. చైనావారు బోర్డర్స్ లో ప్రవేశించి మా జవాన్లను చంపారని, కానీ దీన్ని మోడీ తోసిపుచ్చుతున్నారని రాహుల్ ఆరోపించారు. అమెరికాతో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.