భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉక్రెయిన్ లో ఘర్షణ పరిస్థితిని ఎక్కువ కాలం తట్టుకోలేవని వ్యాఖ్యానించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఈ విషయాన్ని అన్ని దేశాలూ సరిగ్గా గుర్తించాల్సి ఉందన్నారు. రాళ్లు వేయడం కాదు. ముందు పరిస్థితిని అర్థం చేసుకుంటే ఎటువంటి మాటలకు అయినా దిగవచ్చునన్నారు.
చమురు గ్యాస్ లు విక్రయించడం ద్వారా వచ్చే నిధులను రష్యా ఉక్రెయిన్ పై దాడి కొనసాగింపునకు వాడుతోందా..? అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఇది అనుచిత అంశం అని పేర్కొన్నారు. దేశాలు తమ నిత్యావసరాల కోసం రష్యా నుంచి చమురు లేదా సహజ వాయువులను పొందుతున్నాయని వివరించారు.
స్లోవేకియాలో జరుగుతోన్న గ్లోబ్ సెక్ 2022 బ్రెటిస్లేవా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై తలెత్తుతున్న విమర్శలను తిప్పి కొట్టారు. రష్యా నుంచి ముడి చమురును పొందడాన్ని సమర్థిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్ పై రెండు మూడు నెలలుగా యుద్ధం కొనసాగుతుప్పటికీ.. ఐరోపా దేశాలు రష్యా నుంచి చమురు తెప్పించుకుంటూనే ఉన్నాయని గుర్తు చేశారు. అటువంటి దేశాలు అనవసరంగా భారత్ ను నిందించడం సరికాదని వ్యాఖ్యానించారు.
యుద్ధం దశలో నిత్యావసర సరుకులు కొరత వచ్చేలా చేసుకునే పరిస్థితి రాకూడదని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇదే కోరుకుంటాయన్నారు. ఐరోపా దేశాలు ఇప్పటికీ పైప్‌లైన్ల ద్వారా రష్యా నుంచి గ్యాస్ పొందుతున్నాయి కదా..? అని ప్రశ్నించారు. ఆ దేశాలు సరఫరాలు పొందడం న్యాయం, భారత్ తీసుకుంటే అన్యాయం అవుతుందా..? అని విరుచుకుపడ్డారు జై శంకర్.