తమిళనాడులో జల్లికట్టు సందడిగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యువకులు సంప్రదాయ క్రీడలో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. శనివారం మదురై, తిరుచ్చి జిల్లాలో పోటీలు ప్రారంభించారు. పాలమేడు జల్లికట్టులో 700 ఎద్దులు, 300 మంది యువకులు, తిరుచ్చి జల్లికట్టులో 500 ఎద్దులు, 300 మంది యువకులు.. కోడెగిత్తలను అదుపు చేసేందుకు పోటీ పడ్డారు.
జల్లికట్టులో 150 మందికి మించి పాల్గొనవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ.. ఎక్కడా కరోనా నిబంధనలు పాటించడం లేదు. వందల మంది ప్రజలు వేడుక చూసేందుకు గుమిగూడారు. మదురైలోని అవనియాపురంలో జల్లికట్టు కోలాహలం కనిపిస్తోంది.
జల్లికట్టులో పాల్గొనే వారందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పూర్తై ఉండాలనే నిబంధన పెట్టారు. బరిలోకి వెళ్లే ముందు నెగిటివ్ రిపోర్ట్ సమర్పించడం లాంటి నిబంధనల్ని తప్పనిసరి చేశారు. పోట్ల గిత్తల్నిమచ్చిక చేసుకుని, లొంగదీసినవారే ఈ పోటీల్లో విజేతగా నిలుస్తారు.
గతంలో ఎద్దుల మెడలో పలకల్ని కట్టేవారు. అవి తీసుకొచ్చినవారు విజేతలయ్యేవారు. కానీ.. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ఎక్కువ సేపు ఎద్దును కట్టడి చేయగలిగినవారినే విజేతలుగా నిర్ణయిస్తున్నారు. పోటీలను చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా ఎవరు ఆగడం లేదు. కరోనా నిబంధనల ఉల్లంఘన మధ్యే పోటీలు జోరుగా సాగుతున్నాయి.