సుమారు 1380 కోట్ల సంవత్సరాల కిందట ఒక మహా విస్పోటనం (బిగ్ బ్యాంగ్) ద్వారా విశ్వం ఏర్పడింది. దాని తరువాత వెంటనే జరిగిన పరిణామాలపై ఖగోళ శాస్త్రవేత్తల్లో అమితాశక్తి ఏర్పడింది. దీని కోసమే నాసా జేడబ్ల్యూఎస్‌టీని తయారు చేసింది. ఇది తీసిన తొలి చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “విశ్వంలో కెమెరా కళ్లకు చిక్కిన అత్యంత పురాతన కాంతి ఇదే. ఆ వెలుగు రేఖల వయసు 1300 కోట్ల ఏళ్లు” అని పేర్కొన్నారు.
జేడబ్ల్యూఎస్‌టీ తీసిన తొలి చిత్రంలో తెలుపు, పసుపు, నారింజ వర్ణాల్లో వందలాది గెలాక్సీలు కనిపించాయి. ఎస్‌ఎంఏసీఎస్ 0723 అనే గెలాక్సీ క్లస్టర్‌లో ఈ భాగం ఉంది. జేడబ్ల్యూఎస్‌టీలోని ‘నియర్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా’ దీన్ని క్లిక్‌మనిపించింది.
నీలం రంగులో ఉన్న వాస్ప్-96బి అనే ఒక భారీ గ్రహాన్ని జేడబ్ల్యూఎస్‌టీ క్లిక్‌మనిపించింది. ఇది శనిగ్రహం పరిమాణంలో ఉంటుంది. భూమికి 1,150 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దాని వాతావరణాన్ని కూడా జేడబ్ల్యూఎస్‌టీ క్షుణ్నంగా విశ్లేషించింది. ఇందులో నీటి జాడ ఉన్నట్లు వెల్లడైంది. అయితే అక్కడ జీవం మనుగడకు ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితులు కలిగిన మరిన్ని గ్రహాలను ఈ టెలిస్కోపు పసిగడుతుందన్న భరోసా తాజా చిత్రంతో ఏర్పడింది.
16 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి..
వెయ్యి కోట్ల డాలర్ల వ్యయంతో జేడబ్ల్యూఎస్‌టీ ప్రాజెక్టును చేపట్టారు. గత ఏడాది డిసెంబరులో ఈ టెలిస్కోపును ప్రయోగించారు. భూమికి 16 లక్షల కిలోమీటర్ల దూరంలోని ప్రదేశానికి ఇది చేరుకుంది. సూర్యకాంతి నుంచి రక్షణకు ఈ టెలిస్కోపులో టెన్నిస్ కోర్టు పరిమాణంలో ఒక తెరను ఏర్పాటు చేశారు. పాతబడిపోతున్న హబుల్ స్పేస్ టెలిస్కోపునకు ప్రత్యామ్నాయంగా జేడబ్ల్యూఎస్‌టీని ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్టులో ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలకూ భాగస్వామ్యం ఉంది.