రెండు నెలల క్రితం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పోలీసుల అమానుషకాండకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు లైబ్రరీలోకి ప్రవేశించి విద్యార్ధులను ఏ విధంగా కొడుతున్నారో తెలియజేసే 49 సెకన్ల సీసీటీవీ పుటేజ్ ను జామియా కో ఆర్డినేషన్ కమిటీ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఓల్డ్ రీడింగ్ హాల్ (ఎం.ఫిల్ సెక్షన్) లో కూర్చున్న విద్యార్ధులపై పోలీసుల లాఠీ చార్జీ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు రీడింగ్ రూమ్ లోకి ప్రవేశించగానే ఓ విద్యార్ధి టేబుల్ కింద దాక్కున్నాడు…మరో విద్యార్ధి దెబ్బలు తప్పించుకోవడానికి చుట్టూ పరిగెత్తాడు. కొందరు బటయకు పరిగెత్తేందుకు ప్రయత్నించారు. నిరసన ప్రదర్శన దగ్గర నుంచి పోలీసులు ఒక్కసారిగా యూనివర్సిటీలోకి ప్రవేశించి అమాయకులపై దారుణంగా లాఠీచార్జ్ చేశారు. వీడియో విడుదల చేసిన జామియా కో ఆర్డినేషన్ కమిటీలో జామియా యూనివర్సిటీ మాజీ విద్యార్ధులు, ప్రస్తుత విద్యార్ధులున్నారు.
సీఏఏ కు వ్యతిరేకంగా గత ఏడాది డిసెంబర్ 15న జామియా యూనివర్సిటీ విద్యార్ధులు నిరసన ప్రదర్శన నిర్వహించగా ఉద్రిక్తత చోటుచేసుకొని హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. దీంతో పోలీసులు నిరసనకారులపై లాఠీ చార్జీ చేసి చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం యూనివర్సిటీ క్యాంపస్ లోకి చొరబడి ఆడ, మగ తేడా లేకుండా కనపించిన విద్యార్ధినల్లా చితకబాదారు. నిరసనలతో సంబంధం లేని…లైబ్రరీలో చదువుకుంటున్న, హాస్టళ్లలో ఉన్న విద్యార్ధులను చావు దెబ్బలు కొట్టారు. వాష్ రూమ్ లో దాక్కున్న వారిని కూడా వదిలిపెట్టలేదు. ఈ దాడిలో ఓ విద్యార్ధి కనుచూపు పోయింది. మరికొందరు దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయారు. విద్యార్ధినుల పట్ల మగ పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి దేశంలోని ఇతర యూనివర్సిటీల్లో నిరసనలు మొదలయ్యాయి. అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించడంపై వీసీ కూడా తప్పుబట్టారు. అయితే తాము అమాయకులను ఎవరిని కొట్టలేదని పోలీసులు, కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
సీసీటీవీ పుటేజ్ పోలీసులు తీరు స్పష్టంగా కనిపించడంతో కాంగ్రెస్ ఢిల్లీ పోలీసులను తప్పుబట్టింది. ఢిల్లీ పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో..ఓ విద్యార్ధి పుస్తకం చదువుకుంటుండగా పోలీసులు కొడుతూనే ఉన్నారు. పోలీసులు లైబ్రరీలోకి వెళ్లలేదని అమిత్ షా అబద్దాలు చెప్పారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా అన్నారు. ఈ వీడియో చూసిన తర్వాత పోలీసులు ఇంత అమానుషంగా వ్యవహరించినప్పటికీ పోలీసులపై చర్య తీసుకోకపోవడం చూస్తుంటే ప్రభుత్వ వైఖరి అర్ధమవుతుందన్నారు ప్రియాంక వాద్రా.
వీడియోలో కనిపించే పోలీసులపై చర్యలు తీసుకోవాలని మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పు, కవ్వింపు చర్యలు లేకుండానే విద్యార్ధులపై దారుణంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.