భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లో కొనసాగుతోంది. యాత్ర ఈ రోజు శ్రీనగర్‌కు చేరుకుంది. యాత్రలో భాగంగా లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ జెండాను ఎగురవేశారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. సుమారు 75 ఏండ్ల క్రితం లాల్ చౌక్‌లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారని ఆయన గుర్తు చేవారు.
ఇన్నేండ్ల తర్వాత నెహ్రూ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ లాల్ చౌక్‌లో జాతీయపతాకాన్ని ఎగురవేసినట్టు ఆయన పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం స్థానిక కాశ్మీరీ ప్రజలతో కలిసి కాంగ్రెస్ నేతలు జాతీయ గీతాన్ని ఆలపించారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వెంటనే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. లాల్ చౌక్ వద్ద మువ్వన్నెల జెండా కన్నా ఎత్తులో రాహుల్ గాంధీ భారీ కటౌట్ కనిపించింది. యాత్రలో ఈ రోజు రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్ర నేపథ్యంలో లాల్ చౌక్ ప్రాంతంలో పటిష్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. లాల్ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు దిగ్భందం చేశారు. రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో లాల్ చౌక్ ప్రాంతాన్ని పోలీసులు సీల్ చేశారు.