జమ్మూకాశ్మీర్‌లో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై పుల్వామా తరహా దాడి చేశారు. తెల్లవారుజామున చద్దా క్యాంపు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు.
సీఐఎస్ఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని తుపాకులు, గ్రనేడ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాడి సమయంలో బస్సులో 15 మంది జవాన్లు ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రదాడిని బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టగా.. వారి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు సమీపంలోని సుంజ్వాన్ ప్రాంతానికి జారుకున్నారు.
ఈ క్రమంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా.. వారిపైనా ముష్కరులు ఎదురుకాల్పులు జరిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు జమ్ము అడిషనల్ డీజీపీ ముకేశ్‌సింగ్ తెలిపారు. సైనికులు సహా గాయపడిన పోలీసులను స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రధాని నరేంద్ర మోడీ జమ్ములోని పాలి గ్రామాన్ని సందర్శించనున్నారు.
ఈ క్రమంలో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. బలగాలపైకి గ్రనేడ్లు విసిరారు. సుంజ్వాన్ మిలిటరీ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతంలో పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు బలగాలు భావిస్తున్నాయి. వారిని పట్టుకునేందుకు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను, పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.