జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై ప్రభుత్వం కఠినమైన పబ్లిక్ సేప్టీ యాక్ట్ ను ప్రయోగించింది. ఎలాంటి అభియోగాలు లేకుండా గత ఆరు నెలలుగా వారిని నిర్బంధంలో ఉంచిన ప్రభుత్వం…. గురువారంతో ఆరునెలల నిర్బంధం ముగుస్తుండగా తాజాగా పబ్లిక్ సేప్టీ యాక్ట్ ను ప్రయోగిస్తున్నట్టు ప్రకటించింది. ఎలాంటి విచారణ లేకుండా మూడు నెలల పాటు ఈ యాక్ట్ కింద నిర్బంధంలో ఉంచవచ్చు. దీన్ని ప్రభుత్వం ఎన్ని సార్లైనా పొడిగించవచ్చు. మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా వారిపై పబ్లిక్ సేప్టీ యాక్ట్ ప్రయోగించిన విషయాన్ని దృవీకరించారు.
నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన అలీ మహ్మద్ సాగర్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సర్తాజ్ మద్వీ లను కూడా పబ్లిక్ సేప్టీ యాక్ట్ కింద నిర్బంధించారు. అలీ మహ్మద్ సాగర్ కశ్మీర్ లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా ప్రజలను ఓటు వేయడానికి చైతన్యం చేసి అత్యధికంగా పోలింగ్ కావడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిపై పబ్లిక్ సేప్టీ యాక్ట్ కింద నిర్బంధించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత లోక్ సభ సభ్యుడు ఫరూఖ్ అబ్దుల్లా పై ఇంతకు క్రితమే ఈ చట్టం ప్రయోగించి గృహ నిర్బంధం చేసింది. ఆయన ఇంటినే జైలుగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చింది. 83 ఏళ్ల ఫరూఖ్ అబ్దుల్లా ప్రజా ఆదేశాలను ఆటంకపరుస్తున్నారంటూ నిర్బంధించింది.
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్ సయీద్ తో పాటు వందలాది మంది రాజకీయ నేతలను ప్రభుత్వం గృహ నిర్బంధం చేసింది. ఆ తర్వాత కొందరిని విడుదల చేసినప్పటికీ కీలక నేతలపై ఇంకా నిర్బంధం కొనసాగుతూనే ఉంది.
స్మగ్లర్లు, టెర్రరిస్టులు, వేర్పాటు వాదులు, రాళ్లు విసిరే వారిపై ప్రయోగించే పబ్లిక్ సేప్టీ యాక్ట్ ను మొదటి సారిగా రాజకీయ నేతలపై ప్రయోగించారు. ఫరూఖ్ అబ్ధుల్లా తండ్రి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్ధుల్లా కలప స్మగ్లర్ల ను కట్టడి చేసేందుకు పబ్లిక్ సేప్టీ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ఎలాంటి విచారణ లేకుండానే కలప స్మగ్లర్లను నిర్బంధించేవారు. అయితే ప్రజా ఆదేశాలకు ఆటంకం కలిగించే…దిక్కరించే, ప్రజలను అల్లర్లకు రెచ్చగొట్టే వ్యక్తులపై కూడా ఈ దారుణమైన చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.
ఈ చట్టంలో రెండు సెక్షన్లున్నాయి. ఒకటి ప్రజా ఆదేశాలకు ఆటంకం కలిగించే వారిని ఎలాంటి విచారణ లేకుండానే మూడు నెలల పాటు నిర్బంధించడం…ఆ తర్వాత ఆ నిర్బంధాన్ని ఆరు నెలల పాటు పొడిగించడం. రెండోది…ఎవరితోనైనా ”రాజ్యానికి ప్రమాదం ఉంద”ని భావిస్తే ఆ వ్యక్తిని ఈ చట్టం కింది రెండు సంవత్సరాల వరకు నిర్బంధించవచ్చు.