జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. యువతను ఉగ్రసంస్థల్లోకి లాగాలనుకున్న పాకిస్తాన్ గూఢ చర్య సంస్థ ఐఎస్ఐ కుట్రలను పోలీసులు బట్టబయలు చేశారు. దేశంలో భారీ విధ్వంసం సృష్టించాలనుకున్న ఐఎస్ఐకి కుట్రలకు జమ్ము పోలీసులు చెక్ పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే… అమాయకులైన కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు గత కొంత కాలంగా ఐఎస్ఐ సంస్థ ప్రయత్నిస్తోంది. తమ మాటలకు ఆకర్షితులైన యువకులను పాస్ పోర్టు ఇచ్చి పాక్ కు తీసుకు వెళ్తోంది. అక్కడ వారికి ఉగ్రశిక్షణ ఇచ్చి తిరిగి కశ్మీర్‌కు పంపుతోంది.
కశ్మీర్‌లో విధ్వంసానికి వారిని పావులుగా వాడుకుంటోంది. తాజాగా పాక్ నుంచి శిక్షణ పొంది వచ్చిన యువకుల బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి.
విద్య, మతం, సామాజిక కార్యక్రమాల పేరుతో కశ్మీర్ యువతను ఉగ్ర గ్రూపుల్లో రిక్రూట్ చేయాలని టెర్రరిస్టులపై ఐఎస్ఐ ఒత్తిడి తెస్తోందని పోలీసులు తెలిపారు.
బంధువులను కలిసేందుకు పాక్ వెళ్లిన యువతను కూడా మాయమాటలతో తమవైపు ఆకర్షించే ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయన్నారు. అలా ఆకర్షితులైన వారికి పేలుడు పదార్థాలను వినియోగించడం, సమీపం నుంచి కాల్పులు జరపడంపై రెండు వారాల పాటు శిక్షణ ఇస్తోందన్నారు .
ఈ క్రమంలో ఇలాంటి వారిపై తాము ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. అదనపు తనిఖీలు చేపట్టడంతో ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నామన్నారు. యువత పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారు గతంలో భద్రతా దళాలపై రాళ్లు విసరడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారా? అని పరిశీలిస్తున్నామన్నారు.
2015-18 మధ్య 60 మంది కశ్మీరీ యువత పాసుపోర్టుతో పాకిస్థాన్ వెళ్లారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత వారు ఉగ్ర వాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉండటాన్ని తాము గుర్తించామన్నారు. వారిలో 26 మందిని భద్రతాదళాలు ఎన్‌కౌంటర్లలో హతమార్చాయన్నారు. మరో ఆరుగురు ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్నారు.