జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దీపికా పుష్కర్ నాథ్ రాజీనామా చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేబట్టిన భారత్ జోడో పాదయాత్రలో మాజీ మంత్రి లాల్ సింగ్ ని అనుమతించాలని తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆమె రాజీనామా చేశారు. 2018 లో యూపీ లోని కథువాలో 8 ఏళ్ళ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో రేపిస్టులను సమర్థించిన లాల్ సింగ్ ని ఈ యాత్రలో ఎలా అనుమతిస్తారని ఆమె ప్రశ్నించారు. ఆ కేసు దర్యాప్తును నీరు గార్చడానికి కూడా ఆయన బాధ్యుడయ్యాడని ఆమె ఆరోపించారు.
నిందితులను రక్షించేందుకు లాల్ సింగ్ మొత్తం జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్నంతటినీ చీల్చారని, అలాంటి వ్యక్తి పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న భావజాలంతో తాను ఏకీభవించలేనని దీపికా పుష్కర్ నాథ్ పేర్కొన్నారు. వృత్తి రీత్యా లాయర్ అయిన ఈమె.. నాడు బాధిత బాలిక తలిదండ్రులను జమ్మూ లోని హైకోర్టుకు కూడా తీసుకువెళ్లారు.
ఈ కేసు విచారణను పంజాబ్ లోని పఠాన్ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు ఎక్కేలా వారిని ప్రోత్సహించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర త్వరలో జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చేరుకోనుంది.
రెండు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న లాల్ సింగ్.. 2014 లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తరువాత బీజేపీకి కూడా రాజీనామా చేసి.. డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ పేరిట సొంత పార్టీ పెట్టారు. 2018 జనవరిలో కథువా అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని అనేకమంది నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అయితే పరిస్థితిని చల్లబరచడానికే తాను ఆ ర్యాలీలో పాల్గొన్నానని సమర్థించుకున్నారు.