కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యకు భారత భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. 24 గంటల్లోనే పండిట్‌ను హత్య చేసిన లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. బందిపొరలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులు చనిపోయారని, వారికి సహకరించిన స్థానిక ఉగ్రవాది కోసం గాలిస్తున్నామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.
హతమైన ఉగ్రవాదుల్ని ఫైజల్ అలియాస్ సికందర్, అబు ఉకాషా గుర్తించాయి భద్రతా బలగాలు. రాహుల్ భట్ హత్యకు సహకరించిన స్థానిక ఉగ్రవాది లతీఫ్ రదర్ అలియాస్ ఒసామా గురించి గాలింపు కొనసాగుతోందని ఐజీ తెలిపారు. అతడి సాయంతోనే కశ్మీరీ పండిట్‌ను పాక్ ఉగ్రవాదులు కాల్చి చంపారని పేర్కొన్నారు. భట్ హత్యకు ముందు రోజు మే 11న బందీపొర జిల్లా సలిందర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బారాముల్లాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది గుల్షన్ అహ్మద్ గవాయ్ హతమవ్వగా.. ఆ ఎన్‌కౌంటర్ నుంచి ఫైజల్, ఉకాషా తప్పించుకున్నారని ఐజీ చెప్పారు. ఈ ఇద్దరే రాహుల్ భట్‌ను కాల్చి చంపారని వివరించారు.
బుద్గాం జిల్లా చదూరా తాహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ క్లర్క్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఇద్దరు టెర్రరిస్టులు కార్యాలయానికి వచ్చి రాహుల్ భట్‌ను కాల్చిచంపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను బుద్గాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీనగర్‌లోని మహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయాలపాలై రాహుల్ భట్ మరణించారు.
ఈ హత్యపై కశ్మీర్ పండిట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోయ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అంతేకాదు రాహుల్‌భట్ హత్యను నిరసిస్తూ 350 మంది కశ్మీర్ పండిట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు పెరిగిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాహుల్‌భట్ హత్యకు నిరసనగా కశ్మీర్ పండిట్లు చేపట్టిన ఆందోళనలపై పోలీసులు వాటర్ క్యాన్లు , భాష్పవాయువును ప్రయోగించడంపై తీవ్ర వివాదం చెలరేగింది.
మరోవైపు, శుక్రవారం కూడా ఉగ్రవాదుల హింస ఆగలేదు. జమ్మూ కశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్‌ను పుల్వామాలో హత్యచేశారు. అతడ్ని తన నివాసం నుంచి లాక్కెళ్లి కాల్చి చంపారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 21 మంది పాకిస్థానీలు సహా 77 మంది ఉగ్రవాదులను వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో మట్టుబెట్టినట్టు పోలీసులు తెలిపారు. గతేడాది 87 ఎన్‌కౌంటర్‌లలో 168 మంది హతమయ్యారు.