జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇటీవల ఓ టెర్రరిస్టును పట్టుకున్నప్పుడు వారికి ఎన్నడూ లభించని, వారు ఎప్పుడూ ఊహించని ఓ డేంజరస్ వస్తువును చూసి షాక్ తిన్నారు. లష్కరే తోయిబాకు చెందిన ఆ ఉగ్రవాది వద్ద సువాసనలు వెదజల్లే విచిత్రమైన ‘బాంబు’ ఉందట. ఇలాంటి పెర్ఫ్యూమ్ బాంబును తాము స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ గురువారం జమ్మూలో తెలిపారు. పెర్ఫ్యూమ్ బాటిల్ లా ఉన్నదీన్ని చూసి ఎవరైనా ఓపెన్ చేయడానికో, లేదా ప్రెస్ చేయడానికో ప్రయత్నిస్తే ఇది పేలిపోతుందని ఆయన చెప్పారు.
గత జనవరి 21 న నర్వాల్ జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో తాము ఈ టెర్రరిస్ట్ నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జమ్మూ లోని రేసీ జిల్లాలో భద్రతా దళాలకు పట్టుబడిన ఆరిఫ్ అహ్మద్ అనే ఈ ఉగ్రవాది ప్రభుత్వ ఉద్యోగి అని కూడా తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
రిమోట్ తో పేల్చి వేయగల ఈ పెర్ఫ్యూమ్ బాంబులో శక్తిమంతమైన పేలుడు పదార్థాలున్నాయని, నిపుణులు కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయారని దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఇది ఎంత హానికరమైనదో అన్న విషయాన్ని వారు విశ్లేషిస్తున్నారని, ఇప్పటివరకు తాము దీన్ని ముట్టుకోలేదని అన్నారు.
లష్కరే తోయిబా నుంచి ఆరిఫ్ అహ్మద్ కి గత డిసెంబరు మాసాంతంలో మూడు బాంబులు అందాయని, పాకిస్తాన్ లో ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన ఖాసిం అనే టెర్రరిస్ట్ ఆదేశాలపై ఆరిఫ్ పని చేస్తుంటాడని ఆయన పేర్కొన్నారు. ఖాసీం సూచనలపై జమ్మూ కశ్మీర్ లో మరికొంతమంది ఉగ్రవాద సానుభూతిపరులు దొంగచాటుగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు భావిస్తున్నామని డీజీపీ వెల్లడించారు.