జమ్మూకాశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో కశ్మీర్ పండిట్‌లే టార్గెట్‌గా దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు.. మరోసారి రెచ్చిపోయారు. బుద్గావ్ జిల్లాలో గురువారం ఓ కశ్మీర్ పండిట్‌ను దారుణంగా కాల్చి చంపేశారు ఉగ్రవాదులు.
చదూరా ప్రాంతంలోని తహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ అనే కశ్మీరీ పండిట్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు.. అక్కడ పనిచేస్తున్న రాహుల్ భట్‌పై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భట్‌ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు జరుపుతున్నాయి. అయితే, ఈ దాడికి తామే బాధ్యులంటూ కాశ్మీర్ టైగర్స్ అనే అంతగా పేరులేని సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది. అయితే, ఈ వాదనను పోలీసులు వెంటనే ధృవీకరించలేదు.
ఇదిలావుండగా, కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. 2021 అక్టోబరు నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ హత్యకు నిరసనగా పెద్ద ఎత్తున్న కశ్మీర్ పండిట్లు గురువారం రాత్రి పలుచోట్ల నిరసనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
అయితే, ఇటీవల కాలంలో ఉగ్రవాదులను వరసపెట్టి ఏరి పారేస్తున్నాయి భద్రతా దళాలు. వరసగా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్ కౌంటర్లు జరగుతూనే ఉన్నాయి. వీటిల్లో లష్కర్ , జైష్ కు సంబంధించిన కమాండర్ స్థాయి ఉగ్రవాదులను ఆర్మీ తుదముట్టిస్తోంది.