లేచింది మహిళా లోకం అంటూ మహిళా సాధికారత మీద ఎప్పుడో పాటలు వచ్చాయి. ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ అంతరిక్షానికి సైతం దూసుకుపోతున్నారు మహిళలు. ఆర్మీ,నేవీ లాంటి రిస్కీజాబుల్లో కూడా తమ సత్తాచాటుతున్నారు.
మహిళాలోకం ఎంత కష్టపడినా…ఎంత తెగువ చూపించినా వారికి రావాల్సినంత గుర్తింపు రావటం లేదనే చెప్పాలి. ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పురుషులు చేసే పని మహిళలు వారు చేస్తుండటం చూసి ముక్కున వేలేసుకునేవాళ్ళు చెవులు కొరుక్కునే వాళ్ళూ ఉండనే ఉన్నారు.
అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్‌లోని జమ్ము జిల్లాకు చెందిన రంజీత్ కౌర్ అనే మహిళ.. సమాజం వేసిన అడ్డుకట్టలు తెంచుకుంది. అంతంత మాత్రం సంపాదనతో కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న తన భర్తకు సంపాదనలో చేదోడువాదోడుగా ఉండాలని నిర్ణయించుకుంది.
అందుకోసం జమ్ముకశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పరిధిలోని ఉమీద్ స్కీమ్‌లో చేరి ఆటో నడపడంలో శిక్షణ తీసుకుంది. కానీ, ఆటో నడుపుతానని చెబితే భర్త అంగీకరించలేదు.
అయినా పట్టుబట్టి ఎట్టకేలకు భర్తను ఒప్పించింది. అనంతరం ఉమీద్ స్కీమ్ కింద ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో ఆటో కొనుగోలు చేసి నడుపుతోంది. ప్రస్తుతం జమ్ము రోడ్లలో రంజీత్ కౌర్ ఆటో పరుగులు పెడుతోంది.
దాంతో జమ్ము జిల్లాలో ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్న తొలి మహిళగా రంజీత్ కౌర్ గుర్తింపు పొందింది. ప్రస్తుతం తాను రోజుకు రూ.1500 నుంచి 2000 వరకు ఆర్జిస్తున్నానని రంజీత్ కౌర్ తెలిపింది.
ముందుగా తనను విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారని చెప్పింది. ప్రయాణికులు కూడా తాను చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారని వెల్లడించింది.మహిళలు డబ్బు కోసం తండ్రుల మీద, భర్తల మీద ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలని రంజీత్ చెబుతున్నది.