మెదక్ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ భార్య జమున స్పందించారు. భూముల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. తమకు ఎటువంటి వివరాలు ఇవ్వకుండా ప్రెస్ మీట్ ఎలా పెడుతారని ప్రశ్నించారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టడానికే ఉన్నారా? ధరణిలో ఎంట్రీ అయిన భూములనే తాము కొన్నామని చెప్పారు. లాయర్ ద్వారా లీగల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని వివరించారు. కలెక్టర్ వ్యాఖ్యల ప్రకారం.. ధరణి వల్ల ఉపయోగం లేదా.. అందులో ఉన్న భూములన్నీ ఫేకేనా అని నిలదీశారు.
Also Read: వేల కోట్ల మిల్లింగ్ స్కాం.. కేటీఆర్ కు తెలుసు..?
‘‘సర్వే నెంబర్ 81 లో తమకు ఉన్నది 5 ఎకరాల 30 గుంటలే.. సర్వే నెంబర్ 130లో మూడు ఎకరాలు ఉంది.. కానీ కలెక్టర్ మాత్రం 70 ఎకరాలు ఆక్రమించారు అని చెపుతున్నారు. మేము ఎవరి దగ్గర భూమి గుంజుకుని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు’’ అంటూ వివరణ ఇచ్చారు జమున. కలెక్టర్లు టీఆర్ఎస్ కండువా కప్పుకొని పనిచేస్తున్నారని విమర్శించారు. 2018లో తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని.. దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయని చెప్పారు. అన్ని రకాల అనుమతులు వచ్చాకే షెడ్స్ నిర్మాణం చేశామన్నారు.
నాలా కనెక్షన్ కు అప్లికేషన్ పెట్టినా ఇవ్వట్లేదన్న జమున.. ఈ ఇష్యూని వదిలేది లేదని కలెక్టర్ పై కేసు పెడతామని తెలిపారు. ‘‘చాలామంది రాజకీయ నాయకులకు హ్యాచరీలు ఉన్నాయి.. మరి వాటి దగ్గర పొల్యూషన్ రాదా. పొల్యూషన్ సర్టిఫికెట్ కావాలని ఇప్పుడు అడుగుతున్నారు. ఈటలను రోడ్డు మీద వేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఫీడ్ ప్లాంట్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తోంది. కేసీఆర్ ఇలానే చేస్తే అన్ని జిల్లాలకు తిరిగి ఈటల సీఎం బండారం బయటపెడుతారు. ఒక్క జిల్లా కాదు రోజు 3 జిల్లాలు తిరగమని ఈటలకు చెప్తా. కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు మానుకోవాలి’’ అంటూ మండిపడ్డారు జమున.
Advertisements
Also Read: టీఆర్ఎస్ ఎంపీలను కోడిగుడ్లు, చీపుర్లతో కొట్టాలి.. రేవంత్ ఫైర్