హైదరాబాద్ నగరంలో రోజు రోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతుంది. అదే స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించే వారు కూడా పెరిగిపోయారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపే వారి కారణంగా తరచూ రోడ్డు ప్రమదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇప్పటికే జరిమానాలు ఓ రేంజ్ లో పెంచేసిన ట్రాఫిక్ పోలీసులు.. నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ మళ్లీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు.
అయితే ఈ ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. పెంచిన చాలాన్లతో సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. మరోవైపు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వారికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు విధిస్తున్నారు వాహనదారులు ఫైర్ అవుతున్నారు.
తాజాగా నగరంలో ఓ బండి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ పట్టుబడగా.. ట్రాఫిక్ పోలీసులు మరో బండికి ఫైన్ వేశారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ పట్టుబడిన ఓ స్కూటీ నెంబర్ కనిపించకపోవడంతో.. TS27C4258 నెంబర్ గల హెచ్ఎఫ్ డీలక్స్ బండికి ఫైన్ విధించారు.
ఈ మేరకు జనగాం వాసి ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. సంపత్ పబ్బా అనే వాహనదారుడి బండికి చలానా విధించడంపై ట్విట్టర్ వేదికగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ‘అయ్యా డీజీపీ గారు బండి నెంబర్ కనబడకపోతే ఎవరికి పడితే వారికి ఫైన్లు వేస్తున్నారు. జర పట్టించుకోండి సారూ.. ఈ బండి మాది కానే కాదు. ఎలా అండి ఇలా అయితే’ అంటూ డీజీపీకి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.