జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చేధు అనుభవం ఎదురైంది. మా గ్రామానికి ఏం చేశావని ఊర్లోకి వచ్చావు.. గో బ్యాక్.. గో బ్యాక్.. అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. మండలంలోని కడవేర్గు గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులకి, నిరసన కారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వర్షాకాలం వస్తే కడవేర్గు, పెద్ద రాజుపేట గ్రామాల మధ్యన రాకపోకలకు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. మధ్యలో వంతెన ఏర్పాటుకు ముత్తిరెడ్డి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ నిర్మాణాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో నీటి సమస్యతో పాటు పలు సమస్యలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. గ్రామంలో సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే.. గ్రామానికి వచ్చే నైతిక హక్కుల లేదంటూ మండిపడ్డారు గ్రామస్తులు.