దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ రెండోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఇద్దరూ కలిసి లైగర్ చేశారు. అది ఆగస్ట్ 25న థియేటర్లలోకి వస్తోంది. అంతకంటే ముందే, వీరిద్దరూ మరొకదాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
‘జనగణమన’ పేరుతో దేశభక్తితో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ సౌతాఫ్రికాలో జరగనుంది. నిర్మాత ఛార్మి, దర్శకుడు పూరి జగన్నాధ్ ఇప్పటికే తమ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. మార్చి నెలాఖరకు పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది.
‘జనగణమన’లో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ‘లైగర్’ కోసం ఈ హీరో ఫుల్లుగా జుట్టు పెంచుకున్నాడు. ఇప్పుడు జనగణమన కోసం మిలట్రీ కటింగ్ చేయించబోతున్నాడు దర్శకుడు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలపైకి తీసుకురాబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ను తీసుకునేందుకు ఛార్మీ ప్రయత్నిస్తోంది.
లైగర్ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అయిపోతాడని పూరి-ఛార్మి గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇలా జనగణమనతో ముందుగానే అతడ్ని లాక్ చేసి పెట్టుకున్నారు. లైగర్ హిట్టయితే.. జనగణమన ప్రాజెక్ట్ హాట్ కేక్ అవుతుంది. లేదంటే మళ్లీ మామూలే.