విశాఖలో శనివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పవన్ కు స్వాగతం పలికేందుకు వందల మంది జనసైనికులు ఎయిర్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని, తిరిగి వెళ్లేందుకు మంత్రి రోజా, పేర్ని నాని, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు కొందరు వైసీపీ నేతల కార్లపై రాళ్లు, చెప్పులు విసిరారు. మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జోగి రమేష్, రోజా, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తల దాడిలో జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కాగా ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్, వైవీ సుబ్బారెడ్డిలు స్పందించారు. ఇది మంచి పద్దతి కాదంటూ పేర్కొన్నారు. జనసేన దాడిలో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని మండిపడ్డారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
జన వాణి కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద కళావాణి స్టేడియంలో ఆదివారం జరిగే జనవాణి కార్యక్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.