ఉత్తరాంధ్ర ప్రజల బతుకు వేదన, వలసల నిరోధం, మత్స్యకారుల రోదనల గురించి చెప్పుకునేందుకు యువశక్తి ఓ వేదిక కానుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నెల 12న రణస్థలంలో యువశక్తి సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీని కేటాయించిమని ఓ ప్రకటన విడుదల చేశారు. యువకులు ఫోన్ నంబర్ 080-69932222, janasenaparty.orgని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. యువశక్తిలో మీ గళం వినిపించండని ఆయన కోరారు.
యువశక్తి కార్యక్రమంలో వేదిక నుంచి మాట్లాడేందుకు సామాన్య యువతీ, యువకులకు అవకాశం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారని ఆయన వెల్లడించారు. ఉద్దానంలో ఆరోగ్య క్షీణత, ఉత్తరాంధ్ర అభివృద్ధికి భవిష్యత్ ఆలోచనలు, ఇతర సమస్యలతో పాటు స్ఫూర్తివంతమైన విజయ గాధలు తెలపాలని ఆయన కోరారు.
యువత ఈ వేదిక నుంచి తమ ఆలోచనలను పంచుకోవచ్చన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో యువత తమ గుండె గొంతుకను వినిపించవచ్చన్నారు. దీనిలో పాల్గొనేందుకు జనవరి 5 నుంచి 8లోపు యువతీ యువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
వాయిస్ రికార్డర్ ద్వారా ఈ ఫోన్ నెంబర్ పని చేస్తుందన్నారు. యువతీ యువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి చెప్పవచ్చని వివరించారు. లేదా ఈ-మెయిల్‌కు వివరాలను పంపవచ్చని సూచించారు.