ట్విట్టర్ వేదికగా వైసీపీపై చేస్తున్న వార్‌లో జనసేనాని సక్సెస్ అయితే, వాల్మీకి టైటిల్ వివాదం రాజేసి చిట్ట చివరి నిమిషంలో రెండు జిల్లాల్లో ఆ సినిమా ప్రదర్శన నిలిపివేయడంలో జగన్ సేన విజయం సాధించింది. వోవరాల్‌గా జగన్ సేన వర్సెస్ జనసేన వార్ నడుస్తోంది. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ డిస్కషన్!
గుంటూరు: తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు చాలా బర్నింగ్ టాపిక్స్ వున్నాయి. బోటు ప్రమాదం.. గ్రామ సచివాలయం పోస్టుల ఎగ్జామ్ పేపర్ లీకేజ్, పోలవరం రివర్స్ టెండరింగ్, టీటీడీ పాలక మండలి వివాదం.. ఈ వివాదాలన్నీ పక్కకు పోయేందుకు ఇప్పుడు జనసేనతో జగన్ సేన వార్ మొదలెట్టింది. దాంతో పాత వివాదాలు మరుగునపడి ఈ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. జన సేనాని అన్న కుమారుడు వరుణ్‌తేజ్ లేటెస్ట్ మూవీ ‘వాల్మీకి’ మూవీని రెండు జిల్లాల్లో నిలిపివేయించడంతో సక్సెస్ అయినట్టుగా సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు చేస్తున్న ప్రచారం ఇదే వెల్లడిస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వాల్మీకి టైటిల్‌పై వున్న వివాదాన్ని దృష్టిలో వుంచుకుని ఉద్రిక్తతలు తలెత్తకుండా ఆ సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్లు నిన్న అప్పటికప్పుడు ప్రకటించారు. దాంతో వాల్మీకి చిత్ర యూనిట్ ఎందుకైనా మంచిదనే ఉద్దేశ్యంతో అప్పటికే సిద్ధం చేసుకున్న గద్దలకొండ గణేష్ అనే టైటిల్‌ను అనౌన్స్ చేసింది. నాగబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ జగన్‌తో పెట్టుకుంటే ఇంతేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ చూస్తే ఈ రెండు రాజకీయ వర్గాల మధ్య వార్ బాగా ముదిరినట్టుగా అర్ధం అవుతోంది.