పవర్ స్టార్ భయపడ్డ సంక్షోభం ఇదేనా?

కొద్దిరోజులుగా జనసేనకు ఎడం కన్ను అదురుతోంది. ఏదో కీడు శంకిస్తున్నట్లు పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. మూడ్నెల్ల కిందట కత్తి మహేష్ అనే ఒక ‘మహా గండం’ నుంచి ఎలాగోలా తప్పించుకుని బైటపడ్డ పవన్‌కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్.. త్వరలో అంతకంటే భారీ సంక్షోభం పొంచి ఉందంటూ బెంబేలెత్తిపోతోంది. ఈ మేరకు రిపీటెడ్‌గా పోస్ట్‌లు పెడుతూ.. అభిమానులు, పార్టీ క్యాడర్ పరస్పరం అప్రమత్తం చేసుకోవడంపై టాక్ నడిచింది. అనవసరంగా ఆవేశపడొద్దని, మాట తూలవద్దని చెప్పుకుంటూ సిమిలారిటీతో కూడిన కాషన్ నోటీసులు జనసేన ఫాలోయర్ల మధ్య చక్కర్లు కొట్టిన మాట వాస్తవం. ఇంతకీ.. ఏమిటా సంక్షోభం? దాంతో జనసేనకు ముప్పు తప్పదా?

చంద్రబాబుతో ‘పొలిటికల్ తకరారు’కి దిగినప్పుడే తమ మీద ఎదురుదాడి తప్పకపోవచ్చని పవన్ కళ్యాణ్ భావించారు. అనుకున్నట్లే.. తెలుగుదేశం నేతలు పవర్‌స్టార్ ‘క్యారెక్టర్’ మీద ఎటాక్ మొదలుపెట్టేశారు. నోటికొచ్చినంతా అనేశారు కూడా. కానీ ఆ దూకుడు అక్కడితోనే ఆగిపోయిపోయింది. అయితే.. టీడీపీ, బీజేపీ, వైసీపీలతో ఉమ్మడి గొడవకు దిగి.. రాజకీయంగా ఒంటరిగా మారిపోయింది జనసేన. ఎటునుంచైనా తమను ‘దొంగదెబ్బ’ తీయడానికి పార్టీలు కాచుకుని ఉంటాయన్న హెచ్చరికలు అంతర్గతంగా జారీ చేశారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కొత్త మనిషి కనుక పవన్ కళ్యాణ్ మీద అవినీతి కేసులూ గట్రా ఏమీ లేవు. ఇక మిగిలిందల్లా అతడి వ్యక్తిత్వం ఒక్కటే. దాన్ని సూటిగా ఎటాక్ చేయగలిగితే ఎంతోకొంత లబ్ది పొందవచ్చని రాజకీయ శత్రువులు భావించినా ఆశ్చర్యం లేదు.

కట్ చేస్తే… ఇప్పుడు టాలీవుడ్‌లో ‘కాస్టింగ్ కౌచ్’ రగడ. అటు సినిమా.. ఇటు సోషల్ లైఫ్.. రెండు పార్శ్వాలున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ సహజంగానే మెయిన్ టార్గెట్‌గా మారిపోయారు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి తప్ప.. టీవీ డిబేట్లో కూర్చుంటే లాభం లేదన్న పవన్ కళ్యాణ్ మీద.. రెండురోజులుగా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పవర్‌స్టార్ మీద బహిరంగ కామెంట్ చేసింది నటి శృతి. బెంగాలీ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటారని, ఆయన్ను నమ్మి ఎవరూ ఓట్లెయ్యవద్దని పిలుపునిచ్చిందామె. ఐతే.. ఈ సాహసం చేసిన మరుసటిరోజే తానన్న మాటల్ని సీరియస్‌గా తీసుకోవద్దంటూ ఆ అమ్మాయి క్షమాపణ చెప్పింది. కాస్టింగ్ కౌచ్ ఎపిసోడ్‌కి టెంకాయ కొట్టిన శ్రీరెడ్డి సైతం.. పవన్ కళ్యాణ్ మీద విసుర్లు మొదలుపెట్టింది. ఆయన రెస్పాన్స్ అసంబద్ధంగా ఉందని, హీరోలు ముందుకొచ్చి తమ సమస్యలపై స్పందించాలని ఓపెన్ ఛాలెంజ్ విసురుతోంది శ్రీరెడ్డి. మరో అడుగు ముందుకేసి.. పవన్‌కళ్యాణ్ ఒక మాదర్చోద్ అంటూ విరుచుకుపడింది. ఆయన్ను అన్నా అని పిల్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా అంటూ.. అన్నంత పనీ చేసింది. దీంతో, పవర్ ఫ్యాన్స్ నోటికి, చేతికి మళ్ళీ పని దొరికింది. అక్కడక్కడా సహనాలు చచ్చిపోతున్న సౌండ్స్ కూడా వినపడ్తున్నాయి.

https://youtu.be/vSiIpxesucE

ప్రత్యేకించి పవన్ ని టార్గెట్ చేస్తున్న శ్రీరెడ్డి వెనుక ఎవరున్నారన్నది అటుంచితే..  అసలే ఉడుకురక్తం.. ఏమవుతుందో ఏమోనంటూ జనసేనలో మితవాద వర్గం వణికిపోతోంది. అనేకసార్లు మాటలు తడబడి.. పదేపదే పొంతన లేని ప్రకటనలు జారీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌నే ఇక్కడ దోషిగా నిలబెట్టే వాళ్ళూ లేకపోలేదు. ఏదేమైనా అధినేత మాటకు కట్టుబడి ఉండాలి కనుక.. ఇటువంటి సంక్లిష్ట సమయాల్లో సంయమనంతో ముందుకెళ్లాలని జనసేన భావిస్తోంది.