జనసేన కార్యకర్త లోకేశ్‌ను ఆత్మహత్య యత్నానికి ప్రేరేపించిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన లోకేశ్ పోలీసు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిసి బాధపడ్డానన్నారు పవన్. పోలీసులు ప్రజలకే జవాబుదారీ… అంతే కానీ అధికార పక్షానికికాదన్నారు. ఇసుక అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులు వేధిస్తారా అని ప్రశ్నించారు పవన్.
లోకేశ్‌ను స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రఘు వేధించడం వల్లే ప్రాణం తీసుకోవాలనుకొన్నాడని తెలిసిందన్నారు. అక్రమాలను ప్రశ్నించిన వారినే వేధించడం చట్ట సమ్మతమా అంటూ మండిపడ్డారు. పోలీసు వేధింపులు, అధికార పార్టీ నాయకుల వేధింపులపై ప్రజాస్వామ్య ధోరణిలో పోరాడాలన్నారు. ఈ ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అధికార పక్షం చేస్తున్న ఇసుక దందా ఇతర అక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా నేతలకు పవన్ సూచించారు.