గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉండాలని అభిప్రాయపడిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అందుకోసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకే తమ మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు.
పవన్ ప్రకటనకు ముందు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌తో కలిసి హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాజా పరిస్థితులపై చర్చించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరముందన్న పవన్… ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయంటూ క్లారిటీ ఇచ్చారు.
వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలనే బీజేపీ భావించింది. ఆ పార్టీ నుంచి ఎలాంటి పొత్తు పిలుపులు రాకపోవడంతో జనసేన కూడా తమకు బలం ఉన్న డివిజన్లలో క్యాండిడేటలను నిలబెట్టాలని భావించింది. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కానీ.. చివరికి రెండు పార్టీలు కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాయి.