గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో కూల్చివేతల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఆర్థికసాయం అందిస్తానని ప్రకటించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నవంబర్ 27వ తేదీన నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని పవన్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఎయిర్ పోర్టు వద్ద జనసేన వర్గాలు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. పవన్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి పయనమయ్యారు.
కాగా ఇప్పటం గ్రామంలో ఇటీవల రహదారి విస్తరణలో భాగంగా అధికారులు పలు కూల్చివేతలు చేపట్టారు. అయితే, జనసేన సభ ప్రాంగణానికి భూములు ఇచ్చిన కారణంగానే ఇప్పటం గ్రామస్తులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు.
అందులో భాగంగానే కూల్చివేతలకు పాల్పడ్డారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఆర్థికసాయం అందిస్తామని పవన్ ప్రకటించారు. ఆదివారం ఇప్పటంలో నష్టపోయిన వారిని కలిసి వారికి చెక్కులు పంపిణీ చేస్తారు పవన్ కళ్యాణ్.