వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి సేవ చేసిన మహానుభావులనే రాజ్య సభకు పంపుతుంటారని కానీ, సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి రాజ్యసభకు వెళ్లి కూర్చున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో జరిగిన ‘జనసేన లాంగ్‌మార్చ్’ లో మాట్లాడుతూ… సూట్‌కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి మహామహులే ఓడిపోయారని, వారి స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నానని, ఓడిపోవచ్చేమో కానీ, తన చిత్తశుద్ధిలో నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లు జైళ్లో ఉన్న నాయకులు కూడా తనను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. స్వతంత్ర్య పోరాట నాయకుడిలా, లేదా పౌరహక్కులను కాపాడే నాయకుడిలా జైలుకెళ్లారా? సూట్‌కేసు కంపెనీలు పెట్టి జైలుకెళ్లారని ఆయన ధ్వజమెత్తారు. వారిలాగా ఎలాపడితే అలా మాట్లాడనని, వారు పరిధి దాటితే మాత్రం వారి తాట తీస్తామని హెచ్చరిస్తారు. విజయసాయి రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.